శ్రీమద్రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. ఆయన జయంతిని ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకొంటారు. వసిష్ఠ, నారద పులస్త్య మహర్షుల సోదరుడైన ప్రచేతసుడి పుత్రుడు. ఆయన పూర్వ నామధేయం రత్నాకరుడు. ఆ జన్మలో ఇతడు బోయవాడని స్కాందపురాణం చెబుతోంది. శంఖరుషి ఉపదేశం పొంది మరుజన్మలో వాల్మీకిగా అవతరించినట్లు వెల్లడిస్తోంది.
సత్యయుగంలో బ్రహ్మ ఓసారి స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రసభలో పాల్గొన్నాడు. అక్కడి అప్సరసలను చూసి, మనసు చలించడంతో బ్రహ్మ రేతస్సు పతనమై పంకం(బురద)లో పడింది. ఆ పంకం నుంచి ప్రాచేతసుడు జన్మించాడు. అతడు తన జన్మ రహస్యాన్ని సభలో వెల్లడించడంతో బ్రహ్మ ఆగ్రహించి ‘నీవు బోయవాడివై క్రూర కర్మలతో, అతిహేయమైన జీవితం గడుపుతావు’ అని శపిస్తాడు. శాప విముక్తికి మార్గం తెలపాల్సిందిగా తండ్రిని కోరతాడు. సత్పురుషుల కృపతో రామనామం జపించి, రామాయణం రచించి కృతార్థుడవుతావని శాప నివారణోపాయం చెబుతాడు.
శాపగ్రస్తుడైన అతడు బోయవాడై కిరాతులతో స్నేహం చేసి, బోయ యువతిని వివాహమాడి, బిడ్డల్ని కని, అడవి మృగాలను వేటాడి, పచ్చిమాంసం తింటూ బాటసారుల్ని దోచుకుంటూ హేయజీవనం కొనసాగించేవాడు.
ఓసారి అడవిలో వెళ్తున్న సత్పరుషుల్ని అడ్డగించి, వారి దగ్గరున్నది దోచుకోవాలనుకున్నాడు. ‘నీవింత పాపం మూటకట్టు కుంటున్నావు కదా! ఈ పాపఫలితాన్ని నీ భార్య బిడ్డలు కూడా పంచుకుంటారేమో అడిగి రా!’ అని రుషులు చెబుతారు. రత్నాకరుడు ఇంటికి వెళ్లి రుషులడిగిన ప్రశ్నే వేశాడు భార్యకు. ఆమె అంగీకరించలేదు. తిరిగి రుషుల దగ్గరికి వెళ్లి, జరిగింది చెప్పి, పశ్చాత్తప్తుడైనాడు. తనకు తరణోపాయం చెప్పమని వారిని వేడుకున్నాడు. రామనామజపం చేయమని మంత్రోపదేశం చేసి రుషులు వెళ్లిపోయారు. అది సరిగ్గా గుర్తులేక రత్నాకరుడు ‘మరామరా’ అంటూ జపం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు కదలకుండా కూర్చుని, తపస్సు చేశాడు. అతడి చుట్టూ మట్టి పుట్టలు పుట్టలుగా పేరుకుంది. పుట్టను ‘వల్మీకం’ అంటారు. ఆ కారణంగా అతడు వాల్మీకి అయ్యాడు. నారదమహర్షి వచ్చి అతడికి రామకథ వినిపించాడు.
ఒక రోజున ఓ చెట్టుమీద దాంపత్యానుభవం పొందుతున్న క్రౌంచ పక్షుల జంటను చూసి బోయవాడొకడు బాణం వదలగా, ఆ శరాఘాతానికి మగపక్షి కింద పడి ప్రాణం విడిచింది. ఆడపక్షి దుఃఖంతో విలవిల్లాడింది. ఆ హృదయవిదారక దృశ్యం చూసిన వాల్మీకి హృదయం ద్రవీభూతమైంది. కాకతాళీయంగా ఆ శోకంనుంచి ఒక శ్లోకం ఆవిర్భవించింది. ఆ శ్లోకం ‘మానిషాద’ అనే పదంతో ఆరంభమై శ్రీమద్రామాయణ మహాకావ్యంగా రూపొందింది. బ్రహ్మ సంకల్పంతో శ్రీరాముడి భూతభవిష్యద్వర్తమాన కాల వృత్తాంతమంతా ఓ మహావరమై సంప్రాప్తించింది వాల్మీకికి. ఈ భూమి మీద అవతరించిన ఆది కావ్యం రామాయణం. అది రచించిన వాల్మీకి ఆదికవి. రామకథను అందించి లోకానికి ధర్మప్రబోధం చేశాడు. ధర్మార్థకామ మోక్షాలనే నాలుగు మూలస్తంభాలపైన మానవ చైతన్య సౌధానికి పునాదులు వేసిన క్రాంతదర్శి. మానవజాతికి మార్గదర్శి. జీవితంలో అవరోధాలు ఎదురైనప్పుడు, దృఢచిత్తంతో వాటినెలా అధిగమించాలో, మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎలా ఎదగాలో, ఎలా ఒదగాలో నేర్పిన దూరదర్శి. రామకథ మానవ జీవన ప్రస్థానానికి ఉపయోగపడే దివ్యసుధ. ధర్మానికి రాముడి రూపంలో ప్రతిష్ఠచేసిన ప్రసిద్ధ సిద్ధుడు వాల్మీకి.
No comments:
Post a Comment