_*శ్రీ శివ మహాపురాణం - 13 వ అధ్యాయ_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*సదాచారము - శౌచము - ధర్మమానుష్ఠానము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ఋషులిట్లు పలికిరి -*
సదాచారము వలన వివేకి పుణ్యలోకములను జయించగల్గును. అట్టి సదాచారమును మాకు వెంటనే వినిపింపుము. స్వర్గము నిచ్చు ధర్మకార్యములను, నరకమును కల్గించు అధర్మకార్యములను కూడ చెప్పుము .
*సూతుడిట్లు పలికెను -*
సదాచారము కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడనియు , వేదోక్త కర్మలను అనుష్ఠించువాడు విప్రుడనియు నామమును పొందుదురు. సదాచారము , విద్య వేదోక్త కర్మానుష్ఠానము అనువాటిలో ఏదో ఒక గుణము గలవాడు ద్విజుడనబడును . తక్కువ ఆచారము, తక్కువ వేదాధ్యయనము కలిగి , రాజసేవ చేయు బ్రాహ్మణుడు క్షత్రియ బ్రాహ్మణుడనబడును. కొద్ది ఆచారము కలిగి , వ్యవసాయ వ్యాపారములను చేయు బ్రాహ్మణుడు వైశ్య బ్రాహ్మణు డనబడును . స్వయముగా భూమిని దున్ను బ్రాహ్మణుడు శూద్రబ్రాహ్మణు డనబడును. ఇతరుల యందు అసూయ కలిగి , వారికి ద్రోహము చేయు బ్రాహ్మణుడు చండాల బ్రాహ్మణుడనబడును . భూమిని పాలించువాడు రాజు అనియు , ఇతర రాజవంశీయులు క్షత్రియులనియు అనబడుదురు. ధాన్యాదులను అమ్మువాడు వైశ్యుడనియు, ఇతర వైశ్యవంశీయులు వణిక్ అనియు పిలువబడుదురు .
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవచేయువాడు శూద్రుడు అనియు, వ్యవసాయము చేయు ఇతరులు కర్షకులనియు, మిగిలినవారు దస్యులనియు తెలియవలెను . వీరందరు ఉషఃకాలము నందు తూర్పువైపు తిరిగి పరమేశ్వరుని ధ్యానించి, ధర్మార్థ ములను, వాటిలోని క్లేశములను, ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచించవలెను. ప్రాతః కాలము నందు నిద్రను వీడే సమయమును, పద్ధతిని బట్టి, మానవులకు ఆయుర్దాయము, ద్వేషము, మరణము, పాపము, సంపద, వ్యాధి పుష్టి మరియు శక్తి అను ఫలములు కలుగును . రాత్రిలోని ఆఖరి యామమునకు ఉషస్సు అనియు, దానిలోని సగభాగమునకు సంధి అనియు పేరు. ద్విజుడు ఆ సమయములో లేచి, కాలకృత్యములను తీర్చుకొనవలెను . ఇంటికి దూరముగా బయటకు వెళ్లి ఉత్తరముఖముగా కూర్చుండవలెను. దానికి ఇబ్బంది ఉన్నచో ఇతర దిక్కునకు అభిముఖముగా కూర్చుండవలెను.
జలము, అగ్ని, బ్రాహ్మణుడు మొదలగు వాటికి, దేవతలకు ఎదురుగ కూర్చుండరాదు. ఎడమచేతితో గుహ్యమును, కుడిచేతితో నోటిని మూసి , మలవిసర్జన చేసి, పైకిలేచి, దానిని చూడరాదు. జలాశయము నుండి బయటకు తీసుకువచ్చిన జలముతో మాత్రమే శౌచము నాచరించవలెను. దేవ, పితృ, ఋషి తీర్థములలో దిగకుండగా, ఏడు, ఐదు లేక మూడుసార్లు మట్టితో గుదమును శుద్థి చేయవలెను . కొద్ది మట్టితో గుహ్యమును, చేతినిండా మట్టితో గుదమును శుద్ధి చేయవలెను. తరువాత లేచి, కాళ్లను చేతులను కడుగుకొని ఎనిమిది సార్లు నీటిని పుక్కిలించి ఉమ్మి వేయవలెను .
ఏదో ఒక ఆకుతో గాని, పుల్లతో గాని జలాశయమునకు బయట చూపుడువ్రేలిని ఉపయోగించకుండగా దంతధావనమును చేయాలి . జలాధిష్ఠాన దేవతలకు నమస్కరించి మంత్రపూర్వకముగా స్నానము చేయవలెను. కంఠము వరకు నీటిలో దిగి, అట్లు చేయ శక్తి లేనిచో, నడుము వరకు , లేదా మోకాళ్ల వరకు గాని నీటిలో దిగి, మంత్రపూర్వక స్నానమును చేయవలెను. విద్వాంసుడచటనే తీర్థజలముతో దేవ పితృ తర్పణములను చేయవలెను . తెల్లని వస్త్రమును తీసుకొని, అయిదు కచ్చలతో ధరించవలెను. సర్వ కర్మల యందు ఉత్తరీయమును తప్పక ధరించవలెను .
నదుల యందు, ఇతర తీర్థముల యందు స్నానము చేసినప్పుడు స్నానవస్త్రమును అచట ఉతకరాదు. విద్వాంసుడు స్నానాంతరము దానిని బావి వద్దకు గాని, ఇంటికి గాని తీసుకువెళ్లి , రాతిపై గాని, దుంగపై గాని, గట్టి నేలపై గాని, లేదా నీటి యందు గాని ఉతికి పిండవలెను. ఓ ద్విజులారా! ఆ వస్త్రజలము పితృదేవతలకు తృప్తినిచ్చును . జాబాలోపనిషత్తులోని 'అగ్నిరితి భస్మ' అను మంత్రమును ఉచ్చరించి, భస్మతో త్రిపుండ్రమును ధరించవలెను. అట్లు గాక, భస్మను నీట పారవేసినచో, ఆ వ్యక్తి దేహ త్యాగనంతరము నరకమును పొందును. పాపమును తొలగించుట కొరకై 'ఆపో హిష్ఠా' అను మంత్రముతో జలమును శిరస్సుపై చల్లుకొనవలెను.'యస్య క్షయాయ' అను మంత్రముతో పాదములపై చల్లుకొనవలెను. దీనికి సంధ్యాప్రోక్షణమని పేరు .
ఆపోహిష్ఠేత్యాది మంత్రములతో పాదమును, శిరస్సును, హృదయమును, ఆ తరువాత, శిరస్సును, హృదయమును, పాదమును, మరియు హృదయమును, పాదమును, శిరస్సును సంప్రోక్షణ చేయవలెను. పండితులు దీనిని మంత్ర స్నానమందురు . అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు గాని, ఆరోగ్యము లేనప్పుడు గాని రాజునకు, రాష్ట్రమునకు భయము కలిగినప్పుడుగాని, యాత్రాకాలము నందు గాని మంత్రస్నానము చేయవలెను . ఉదయము 'సూర్యశ్చ' అను మంత్రముతో, సాయంకాలము 'అగ్నిశ్చ' అను మంత్రముతో నీటిని త్రాగి, మరల మంత్ర ప్రోక్షణమును చేయవలెను . ఓ బ్రహ్మణులారా! ఉదయము గాయత్రితో అభిమంత్రించిన జలమును తూర్పున కభిముఖముగా సూర్యునకు ఆర్ఘ్యము నీయవలెను. మధ్యాహ్నము మంత్రపూర్వకముగా ఒకే అర్ఘ్యము నీయవలెను .
సాయం సంధ్యలో భూమిపై కూర్చుండి పడమర వైపుకు తిరిగి అర్ఘ్యము నీయవలెను. ఉదయము తూర్పువైపుకు తిరిగి నీటిని కొద్దిగా పైకి విసిరి అర్ఘ్యము నీయవలెను. మధ్యాహ్నము వ్రేళ్లనుండి అర్ఘ్యము నిచ్చి , వ్రేళ్ల మధ్య గుండా లంబముగా సూర్యుని చూడవలెను. తరువాత ఆత్మ ప్రదక్షిణము చేసి, శుద్ధాచమనమును చేయవలెను . సాయంకాల సంధ్య నుండి గంట దాటిన తరువాత సంధ్యను ఉపాసించుట వ్యర్థము. కాలాతిక్రమము కాకుండా సంధ్యోపాసనమును చేయవలెను . నిత్య కర్మలేకుండా ఒక దినము గడచినచో, వంద గాయత్రిని జపించవలెను. నిత్యకర్మ పది దినములు లుప్తమైనచో లక్ష గాయత్రిని చేయవలెను . నిత్య కర్మ అయిన సంధ్యావందనము మాసము దాటి లుప్తమైనచో, మరల ఉపనయనమును చేయవలెను.
శివుడు, గౌరి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, మరియు యముడు మొదలగు దేవతల నుద్దేశించి కార్య సిద్ధి కొరకు తర్పణముల నీయవలెను. తరువాత బ్రహ్మర్పణమును, శుద్ధాచమనమును చేయవలెను . విద్వాంసుడు తీర్థమునకు దక్షిణముగా నుండే ప్రశస్తమైన మఠములో గాని, మంత్రాలయములో గాని, దేవలయములో గాని, గృహము నందు గాని, ఒక నియమిత స్థలము నందు గాని , స్థిరమగు ఆసనము నందున్నవాడై, నిశ్చలమగు మనస్సు గలవాడై, దేవతలందరికీ నమస్కరించి, ముందుగా ఓంకారమును, తరువాత గాయత్రిని జపించవలెను . జీవబ్రహ్మల అభేదమును అనుసంధానము చేయుచూ, ఓంకారమును జపించవలెను.
'ముల్లోకములను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త యుగు విష్ణువును , సంహారకర్త యగు రుద్రుని ఆత్మ ప్రకాశరూపముగా ఉపాసించెదము. ఓంకారము మా యొక్క జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనోవృత్తులను, ధీవృత్తులను , సర్వకాలముల యందు, భోగమోక్షముల నిచ్చు ధర్మము నందు, మరియు జ్ఞానము నందు ప్రేరేపించుగాక!' ఈ తీరున ఓంకారము యొక్క అర్థమును బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయముగా మోక్షమును పొందును . ఈ అర్థము తెలియకున్ననూ బ్రాహ్మణ్యము పరిపూర్తి చెందుటకై నిత్యము ఓంకారమును జపించవలెను. బ్రాహ్మణుడు ప్రతిదినము గాయత్రిని ఉదయము వేయి జపించి , యథాశక్తి ఇతర మంత్రములను కూడ జపించవలెను. మధ్యాహ్నము గాయత్రిని వందసార్లు, సాయంకాలము నందు ఇరువది ఎనిమిది సార్లు జపించవలెనని తెలియవలెను.
మూలాధారము నుండి సహస్రారము వరకు గల ఆరు చక్రములలో విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ , పరమాత్మలను ధ్యానించవలెను . 'సోహం (అది నేనే)' అను పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యమును భావన చేయుచూ, గాయత్రిని జపించవలెను. మరియు, ఆ దేవతలను బ్రహ్మ రంధ్రము నందు, దేహమునకు బయట కూడ భావన చేయవలెను . మహత్తత్త్వము నుండి ఈ వేలాది శరీరములు బయల్వెడలినవి. ఒక్కొక్క గాయత్రీ జపముచే ఒక్కొక్క శరీరమును మెల్లమెల్లగా అతిక్రమించి , జీవుని పరమాత్మ యందు లీనము చేయవలెను. ఇదియే జపము యొక్క తత్త్వము అని చెప్పబడినది.
గాయత్రిని వందగాని, ఇరువది ఎనిమిది గాని జపించవలెను . ఈ విధముగా భావనలో శరీరమును అధిగమించి (తాదాత్మ్యమును వీడి) జపించవలెను. వేయి జపము వలన బ్రహ్మలోకము, వంద జపించినచో ఇంద్రలోకము లభించును . ఇతరులు గాయత్రిని జపించి ఉత్తమ జన్మను పొంది ఆత్మోద్ధారమును గాంచెదరు. ఈ తీరున జపము చేసి సూర్యున కభిముఖముగా ఉపస్థానమును చెప్పవలెను . పన్నెండు లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణు డనబడును. లక్షకు తక్కువ గాయత్రిని జపించిన వాడు వైదిక కర్మలకు అర్హుడు కాడు .
డెబ్బది ఏండ్ల వరకు నియమములను పాటించి, తరువాత సన్న్యసించవలెను. సన్న్యాసి ఉదయమే పన్నెండు వేలు ఓంకారమును జపించవలెను . ఒకరోజు జపమును వీడినచో, మరునాడు రెండురోజుల జపమును పూర్తి చేయవలెను. నెలరోజులు జపమును మానినచో, ఏభై వేలు జపించిన ఆ దోషము తొలగును . అంతకు మించి జపమును వీడినచో, మరల గురువు వద్ద దీక్షను పొందవలెను. అట్లు చేసినచో, దోషము శాంతించును. లేదా, రౌరవ నరకమును పొందును.
కామనలు గలవాడు ఆ కామనలను సిద్ధింపజేసే వేదోక్త కర్మలను ఆచరించుటకు యత్నించవలెను. వాటి కొరకు ధనమును సంపాదించవలెను. కామనలు లేనివానికి ఈ ప్రయత్నము అనావశ్యకము. బ్రాహ్మణుడు ముముక్షువు అయి, సర్వదా బ్రహ్మజ్ఞానమును అభ్యసించవలెను . ధర్మము వలన ధనము, ధనము వలన భోగము లభించును. ధర్మముగా సంపాదించిన ధనముతో లభించిన భోగము వైరాగ్యమునకు హేతువు అగును . అధర్మార్జితమైన ధనముతో అనుభవించే భోగములు రాగమును కలిగించును. ధర్మము ద్రవ్య ధర్మము, దేహధర్మము అని రెండు రకములు . యజ్ఞము మొదలగునవి ద్రవ్యధర్మములు. తీర్థములలో స్నానము చేయుట మొదలగునవి దేహధర్మములు. ధనము వలన మరింత ధనము పుట్టును. తపస్సు వలన దివ్యరూపము లభించును . నిష్కామముగా ధర్మము నాచరించినచో, అంతఃకరణ శుద్ధి కలుగును. శుద్ధి వలన జ్ఞానము కలుగుననుటలో సందియము లేదు.
కృతము మొదలగు యుగములలో తపస్సు ప్రశస్తమైనది కాగా, కలియుగములో ద్రవ్యధర్మము (దానము) ప్రశస్తమైనది . కృతయుగములో ధ్యానము వలన, త్రేతా యుగములో తపస్సు వలన, ద్వాపరములో యజ్ఞానుష్ఠానము వలన, కలియుగములో మూర్తిపూజ వలన జ్ఞానము కలుగును . పుణ్యపాపములు ఎట్టివియో, వాటి ఫలము కూడ అట్టిదిగనే యుండును. దానాదులలో ద్రవ్యమును బట్టి, తపస్సులో కాయక్లేశమును బట్టి పుణ్యఫలములో హేచ్చుతగ్గులు ఉండును . అధర్మము పీడను, ధర్మము సుఖమును వర్థిల్లజేయును . మంచి ప్రవర్తన వలన దుఃఖము, సత్ర్పవర్తన వలన సుఖము కలుగును. కావున, భోగమోక్షములు సిద్ధించుట కొరకై ధర్మమును సంపాదించవలెను.
నల్గురు వ్యక్తులతో కూడిన కుటుంబము గల బ్రాహ్మణునకు వంద సంవత్సరముల వరకు జీవకను సమకూర్చినచో, అట్టి దానము వలన బ్రహ్మలోకము లభించును . వేయి చాంద్రాయణ వ్రతములను చేసినచో, బ్రహ్మలోకము లభించునని చెప్పుదురు.
వేయి కుటుంబములకు జీవికను సమకూర్చిన క్షత్రియుడు ఇంద్రలోకమును పొందును. పదివేల మందికి జీవికను కలుగుజేసినచో, బ్రహ్మలోకము లభించును. మానవుడు ఏ దేవతను ఉద్దేశించి దానము చేయునో , ఆ లోకమును పొందునని వేదవేత్తలు చెప్పుదురు. ధనము లేనివాడు అన్నివేళలా తపస్సును ఆర్జించవలెను .
తీర్థసేవనము వలన, తపస్సు వలన అక్షయ సుఖము లభించును.
ఇపుడు న్యాయముగా ధనము నార్జించు విధమును చెప్పెదను . బ్రాహ్మణుడు సమాహిత చిత్తము గలవాడై పవిత్రమగు ప్రతిగ్రహము వలన, పవిత్రమగు యాజనము (యజ్ఞాదులను చేయించుట) వలన ధనమును సంపాదించవలెను. ధనార్జనలో దైన్యమునకు, అత్యధిక శ్రమకు తావీయరాదు . క్షత్రియుడు భుజబలముతోను, వైశ్యులు వ్యవసాయము చేత, గోపాలన చేత ధనార్జన చేయవలెను. న్యాయముగా సంపాదించిన ధనమును దానము చేయుట వలన జ్ఞానము సిద్ధించును. గురువు యొక్క అనుగ్రహముచే జ్ఞానము ఉదయించిన సర్వులకు మోక్షము సిద్ధించును. మోక్షము వలన ఆత్మ సాక్షాత్కారము కలిగి, పరమానందము లభించును . ఓ ద్విజులారా! ఇది అంతయూ మానవులకు సత్సంగము వలన లభించును. గృహస్థు ధనధాన్యాదులను ఇతరులకు దానము చేయవలెను .
ఏయే కాలముల యందు ఏయే వస్తువులు, ఫలములు, మరియు ధాన్యములు లభించునో, వాటి నన్నిటినీ, హితము గోరు మానవుడు బ్రాహ్మణులకు ఈయవలెను . ఇతరులకు త్రాగునీటిని సర్వదా ఈయవలెను. ఆకలి అను రోగమును శాంతింపజేయుటకై అన్నము నీయవలెను. భూమిని, ధాన్యమును, బియ్యమును, భక్ష్యభోజ్య లేహ్య చోష్యములను నాల్గు విధముల అన్నమును దానము చేయవలెను . దాత పెట్టిన అన్నమును తినిన వ్యక్తి ఆ శక్తితో ఎంతవరకు శ్రవణాదులచే పుణ్యమును సంపాదించునో, దానిలో సగము పుణ్యము ఆ దాతకు లభించు ననుటలో సందేహము లేదు . దానమును స్వీకరించిన వ్యక్తి దానిలో కొంత భాగమును మరల దానము చేసి, మరియు తపస్సును చేసి, ఆ పాపమును పోగొట్టుకొనవలెను. అట్లు గానిచో, రౌరవనరకమును పొందెదరు.
మానవుడు తనవద్దనున్న ధనమును, ధర్మ, వృద్ధి, భోగముల కొరకు మూడు భాగములు చేసి, ధర్మ భాగముతో నిత్య నైమిత్తిక, కామ్య కర్మలను చేయవలెను . వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకొనవలెను. సాధకుడు భోగభాగముతో హితము, పవిత్రము నగు భోగమును మితముగా సేవించవలెను . వ్యవసాయము వలన లభించే ధనములో పదవ వంతును పాప నిర్మూలన కొరకు దానము చేయవలెను. మిగిలిన ధనముతో ధర్మ , వృద్ధి , భోగములను చేయవలెను. అట్లు గానిచో రౌరవ నరకమును పొందును . లేదా, పాపముతో నిండిన బుద్ధి కలవాడగును; లేదా నిశ్చితముగా వినాశమును పొందును. వివేకులైన వారు వ్యాపారుములో లభించిన ధనములో ఆరవ భాగమును దానము చేయవలెను .
బ్రహ్మణులు తాము పొందిన పవిత్రమగు ప్రతిగ్రహములో నాల్గవ వంతును , అకస్మాత్తుగా లభించిన ధనములో సగమును దానము చేయవలెను . అపవిత్రమగు ప్రతి గ్రహము వలన లభించిన సర్వమును సముద్రములో పడవేయవలెను. మానవుడు తనకు భోగభాగ్యములు కలుగుట కొరకై విద్వాంసులను ఆహ్వానించి , దానము చేయవలెను . యాచకుడు అడిగిన వాటిని సర్వమును తన శక్తి మీరకుండగా దానము చేయవలెను. కోరిన వస్తువును దానము చేయనిచో , కోరబడినవాడు ఆ ఋణమును మరుజన్మలో తీర్చవలయును . వివేకులు ఇతరుల దోషమును వర్ణించరాదు. ఓ బ్రాహ్మణులారా! మనము కనిన , లేక వినిన పరదోషములను ప్రకటించరాదు .
వివేకి ఇతరుల హృదయమునకు దుఃఖమును కలిగించే విధంగా పలుకరాదు. ఐశ్వర్యప్రాప్తి కొరకై ఉభయసంధ్యలలో అగ్నిహోత్రమును అనుష్ఠించవలెను . రెండుసార్లు అగ్నిహోత్రమును చేయుటకు శక్తి లేనిచో ఏకకాలము నందైననూ సూర్యాగ్నులకు బియ్యము , ధాన్యము , నేయి , పండు , దుంప , ఇత్యాది హవిస్సును యాథాశాస్త్రముగా అర్పించవలెను . మరియు , యథావిధిగా స్థాలీపాకమును చేయవలెను. హవిస్సు లేనిచో ప్రధాన హోమమునైననూ చేయవలెను . ఏనాడూ ఆరిపోని అగ్నిని విద్వాంసులు అజస్రమని పిలుతురు. అట్లు అగ్నిని ఉపాసించలేనివాడు జపమునైననూ , కనీసము సూర్యునకు నమస్కారమునైననూ చేయవలెను .
ఆత్మ జ్ఞానమును గోరువారు , మరియు ధనమును కోరువారు ఈ విధముగా యథాశాస్త్రముగా ఉపాసించవలెను. బ్రహ్మయజ్ఞమును శ్రద్ధతో అనుష్ఠించువారు , ప్రతిదినము ఈశ్వరుని పూజించువారు . అగ్ని ఉపాసనాపరులు , గురు శశ్రూషను శ్రద్ధగా చేయువారు , బ్రాహ్మణులకు తృప్తిని కలిగించువారు వీరందరు స్వర్గమును పొందెదరు.
*శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు పదమూడవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment